సమస్తమూనూ యేసు ద్వారా చెయ్యబడెను కాబట్టి యేసు సృష్టికర్తా?


ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. – 1 కోరింథీ 8:6

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. కొలస్సీ 1:16  

పై వాక్యాలను బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే “యేసు సృష్టి కర్త” అయి ఉన్నారు అన్నది. నిజానికి పై వాక్యాలలో పౌలు “సర్వమునూ ఆయన ద్వారా సృజింపబడెను” అని చెప్పటాన్ని బట్టి సర్వమునూ యేసుకు వేరుగా దేవుడు సృజించినట్టు తెలుస్తుంది. సరే, పౌలు అలా ఎందుకు ప్రకటించాడు? అన్నది తెలుసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. 

సకల సృష్టి తన ద్వారా చెయ్యబడిందని గానీ, సృష్టి నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉందని గానీ యేసు ఏనాడైనా ప్రకటించుకున్నారా?

సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. మార్కు 10:6

దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. మార్కు 13:19

యేసు స్వయంగా ప్రకటిస్తున్నవే పై వాక్యాలు. వాటిలో గమనర్హమైన విషయం- యేసే స్వయంగా “దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి”, దేవుడు వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేసేను” అనటం. తప్పితే యేసు తనకు తానుగా సృష్టికర్తగా భావించుకుని- “నేను సృజించిన సృష్ట్యాది నుండి”, నేను  వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేశాను” అనటం లేదు. పోనీ త్రిత్వ దైవత్వ వాదులు చెబుతున్నట్టు యెహోవాతో పాటు యేసుకూడా ఒక దేవుడై ఉంది ఆదిలో సృష్టి నిర్మాణం చేశారన్నదే నిజమైతే అప్పుడు కూడా యేసు కచ్చితంగా- “మేము సృజించిన సృష్ట్యాది నుండి” అని, మేము వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేశాము” అని చెప్పి ఉండేవారు. కానీ యేసు తనకు అతీతంగా ఉన్న యెహోవాను ఉద్దేశించి “దేవుడు సృష్ట్యాది నుండి సమస్తమూ సృజించాడ, స్త్రీ, పురుషులను దేవుడే కలుగజేశాడని”ని చెప్పటాన్ని బట్టి యేసు దృష్టిలో సృష్టికర్త ఒక్క యెహోవా మాత్రమే అని తెలుస్తుంది.


యేసు భూమీ, ఆకాశాల సృష్టికర్తగా ప్రకటించింది ఎవనిని?

ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించు చున్నాను. మత్తయి 11:25    

యేసు పై ప్రకటనను బట్టి యేసు తనను తాను ఏనాడూ సృష్టికర్తగా భావించుకోలేదు కానీ సమస్తానీకీ సృష్టికర్తగా ఒక్క యెహోవాయే అని విశ్వసించేవారని తేటతెల్లమవుతుంది.

యేసు తనకు తానుగా ఏదైనా చేయగలిగే శక్తిని కలిగి ఉన్నారా?

నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యోహాను 5:30

ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. యోహాను 12:49

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు... యోహాను 5:19 

నేటి సువార్తీకులు చెబుతున్నట్టు యేసు మానవ మాత్రుడిగా ఉండి “తనంతట తాను ఏదీ చేయలేను” అని  ప్రకటించారని అనుకుందాం! కనీసం ఆయన పరలోకంలోనైనా దేవుడిగా సర్వాధికారాలు కలిగి ఉండాలికదా! మరి యేసు పరలోకంలో నైనా స్వంత అధికారాలు కలిగి ఉన్నారా? అన్నది తెలుసుకుందాం.  

కనీసం పరలోకంలోనైనా ఏదైనా చేయగలిగే శక్తిని కలిగి ఉన్నారా?

అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా  నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. మత్తయి 20:20-23

పై వాక్యాన్ని బట్టి యేసు పరలోకంలో కనీసం స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తిని సైతం కలిగిలేరని తెలుస్తుంది. ఈ విధంగా యేసు “తనంతట తాను ఏదీ చేయలేను” పరలోకంలో సైతం కనీసం తన ప్రక్కన కూర్చోబెట్టుకునే అధికారం నా వశంలో లేదని ప్రకటిస్తున్నప్పుడు నేటి కొందరు బోధకులు కొన్ని వాక్యాలకు విపరీతార్థాలు తొడిగి యేసు సృష్టికర్త అయి ఉన్నారని ప్రకటించటం ఎంత వరకు సమంజసం అన్నది ఆలోచించాలి.   

సృష్టి నిర్మాణంలో యేసు భాగస్వామ్యం ఉందని యెహోవా ఎక్కడైనా  ప్రకటించి ఉన్నాడా?

గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను. –యెషయా 44:24

నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను. ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. యెషయా 45:7,8

భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. యెషయా 45:12

నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును. యెషయా 48:13

ప్రవక్తల సాక్ష్యం:

ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును.  –యిర్మీయ 10:12,13

నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.  నెహేమ్య 9:6

తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136:5

యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వ సమూహము కలిగెను. –కీర్తనలు 33:6  

పై లేఖనాలను బట్టి యెహోవా స్వయంగా తానొక్కడే సకల సృష్టి నిర్మాణమూ చేశాడు తప్పితే తనతోపాటు ఎవరూ భాగస్వాములు కలిగి లేరని ప్రకటిస్తున్నాడు.

సకల సృష్టీ యేసు ద్వారా చెయ్యబడింది అని గానీ, లేక సృష్టి నిర్మాణంలో యేసు భాగస్వామ్యం ఉందని గానీ పౌలు భావించాడా?

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌. రోమా 11:33-36

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు. -అ.పో.కా 17:24,25

అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభా వముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవమూగల దేవుని వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. - అ.పో.కా 14:15

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎఫెసి 3:11

... సమస్తమును కట్టినవాడు దేవుడే. హెబ్రీ 3:3

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును. హెబ్రీ 2:10  

పౌలు స్వయంగా ప్రకటిస్తున్న వాక్యాలను బట్టి పౌలు దృష్టిలో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్క యెహోవాయే తప్ప యేసు కాదని తేటతెల్లమైంది. అటువంటప్పుడు పౌలు, కొలస్సీ 1:16 వాక్యం వ్రాయటం వెనుక ఉద్దేశం యేసు ప్రత్యక్షంగా సృష్టికర్త అయి ఉన్నారని తెలియజేయటం కాదని తెలుస్తుంది.

పైగా పౌలు, యేసు సృష్టికర్త అని ప్రకటిస్తున్నాడా? లేక సృష్టిరాశి అని ప్రకటిస్తున్నాడా?

అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను. - అ.పో.కా 13:23

దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు.. –హెబ్రీ 2:9  

ఈ విధంగా పౌలు “దేవుడు, యేసును పుట్టించాడ”ని, “యేసు, దూతల కంటే తక్కువ వానిగా చెయ్యబడ్డాడని” చెప్పట్టాన్ని బట్టి పౌలు యేసును సృష్టికర్తగా కాక, సృష్టికర్త అయిన యెహోవా ద్వారా సృష్టించబడిన సృష్టిరాశిగా ప్రకటించేవాడని తెలుసుకున్నాం. స్వయంగా యేసు సైతం తాను యెహోవాచే ఆదిలో సృష్టించబడిన సృష్టిరాశి అని ఈ క్రింది విధంగా ప్రకటించుకోవటం.

లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా ... –ప్రకటన 3:14       

యేసు సమస్తమునూ ప్రత్యక్షంగా సృష్టించిన సృష్టికర్త అన్నది పౌలు ఉద్దేశమా?

ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హెబ్రీ 1:2

పై వాక్యంలో సృష్టికర్త అయిన యెహోవా, యేసు ద్వారా ప్రపంచములు సృష్టించాడని పౌలు పరకటి స్తున్నట్టు చూడగలం.  దీనిని బట్టి యేసు ప్రత్యక్షంగా సమస్తమూనూ సృష్టించిన సృష్టికర్త కాదు అనే విషయం ఒకటి సుస్పష్టమైంది. సరే ఇంతకూ ఒకరి ద్వారా సృష్టి చెయ్యబడినంత మాత్రానా వారు సృష్టికర్తలు అయిపోతారా? అన్న ప్రశ్న ఒకటి మనముందు ఉంది. దానికి సమాధానం తెలుసుకుందాం.

ఒకరి ద్వారా ఏదైనా సృష్టించబడినంత మాత్రాన అతను సృష్టికర్త అయిపోతాడా?

ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. హెబ్రీ 3:3

పై వాక్యంలో పౌలు చెబుతున్నది ఏమిటంటే- ప్రతీ ఇల్లు ఎవడైనా ఒకని ద్వారా కట్టబడుతుంది! అయినప్పటికి సమస్తమూనూ కట్టువాడు దేవుడే! అన్నది. దీనిని బట్టి ఒకరిద్వారా ఏదైనా సృష్టించ బడినప్పటికీ వారు దానికి ప్రత్యక్షంగా సృష్టికర్తలు కాలేరు! కానీ వారి ద్వారా ఏది సృష్టింపబడినా దానికి సృష్టికర్త యెహోవాయే అవుతాడు అని తేటతెల్లమైంది.  

అయితే పౌలు, యేసును అతిశయించటంలో యుక్తి ఏమిటి?

ఇప్పటి వరకూ మనము గమనించిన వివరణలో సకల సృష్టినీ యెహోవా ఒక్కడే చేశాడని, యేసు సైతం ఇదేవిషయాన్ని ప్రకటించటాన్ని బట్టి యేసు ప్రత్యక్షంగా సృష్టికర్త కాదు అన్న విషయాన్ని తెలుసు కున్నాం. అంతేకాదు, పౌలు, యేసు ప్రత్యక్షంగా సృష్టికర్త కాదు సమస్తానికి సృష్టికర్తగా యెహోవానే ప్రకటించాడనీ తెలుసుకున్నాం! మరీ ముఖ్యంగా ఒకరి ఒకరిద్వారా ఏదైనా సృష్టించ బడినప్పటికీ వారు దానికి ప్రత్యక్షంగా సృష్టికర్తలు కాలేరు! కానీ వారి ద్వారా ఏది సృష్టింపబడినా దానికి సృష్టికర్త యెహోవాయే అవుతాడు అని పౌలు బోధల ద్వారానే తెలుసుకున్నాం. అయితే ఈ సందర్భంలో దేవుడు సమస్తాన్ని యేసు ద్వారా సృష్టించినట్టు లేఖనాలలో ఎక్కడా ప్రకటించనప్పటికీ, యేసు స్వయంగా అలా ఎక్కడా చెప్పుకోనప్పటికీ పౌలు, యేసును అతిశయించి “దేవుడు సమస్తమూనూ యేసు ద్వారా సృజించినట్టు ఎందుకు ప్రకటించాడు?” అన్న ప్రశ్న ఒకటి మిగిలి ఉంది.

కొన్ని సందర్భాలలో ఎంత ప్రయత్నించినప్పటికీ కష్టతరమైన మరియు దీర్ఘ కాలం వరకు ఆశించిన ఫలితాలు లభించనప్పుడు ఆ పనిని సులువుగా స్వల్ప కాలంలో పూర్తి చేయటానికి క్రొత్త పంథాను అవలంబించటం అనేది అతి సహజమైన విషయం. దానినే “యుక్తి” అంటారు. నాడు పౌలు ఆ “యుక్తి”ని ఉపయోగించటం కారణంగానే అతను అతి కొద్ది కాలంలోనే అధిక శాతం యూదులచే యేసును యేసును అంగీకరింపజేసే ప్రయత్నంలో విజయాన్ని సాధించగలిగాడు. వివరంగా చెప్పాలంటే ఏ యూదులైతే యేసును “మెస్సియ” అని నమ్మటాన్ని తిరస్కరించారో చివరకు కర్కశంగా హత్య చేయటానికి పూనుకున్నారో అదే యూదుల చేత యేసును క్రీస్తుగా అంగీకరింపజేయటమే పౌలు నడిపిన ఉద్యమంలో ప్రధాన లక్ష్యం. ఆ విషయాన్ని ఈ క్రింది వాక్యాలలో చూడగలం.

అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. - అ.పో.కా 9:22

నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖన ములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను. - అ.పో.కా 17:3

సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. -అ.పో.కా 18:5

యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. - అ.పో.కా 18:28     

మరో ప్రక్క శిష్యుల ప్రయత్నం కూడా యేసును క్రీస్తని అంగీకరింపజేయటమే!


ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. - అ.పో.కా 5:42 


యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని (యెహోవాను) ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని (యేసును) ప్రేమించును.  1 యోహాను 5:1

ఈ విధంగా యేసుని క్రీస్తు అని అంగీకరింపజేయటం అనే ప్రక్రియ లేక ఉధ్యమం యేసు ఉన్న కాలంలో యేసు నుండి మొదలై ఆదిమ అపోస్తలులు ద్వారా మరియు పౌలు ద్వారా కొనసాగించబడిందని పై వాక్యాల ద్వారా తెలుసుకున్నాం. యేసు తనను “క్రీస్తు”గా అంగీకరించటాన్ని నిత్యజీవానికి ఆధారంగా పెట్టినప్పటికీ (యోహాను 17:3) ఆదిమ అపోస్తలులు, యేసును క్రీస్తుగా అంగీకరించని యూదుల ముందు యేసును క్రీస్తుగా నమ్మమని పాత పాఠాన్నే వల్లించేవారు. అయితే పౌలు మూస ధోరణిలో ముందు నుండీ జరుగుతున్న ప్రయత్నాలకు భిన్నంగా యేసును యూదులచే క్రీస్తుగా అంగీకరింపజేసే క్రమంలో ఒక అడుగు ముందుకు వేసి కొంత యుక్తిని ఉపయోగిస్తూ ఉండేవాడు.

అయితే పౌలు, యేసును క్రీస్తుగా అంగీకరింజేయటానికి అవలంబించిన యుక్తి ఏమిటి?

యేసును క్రీస్తుగా అంగీకరింపజేయటం అన్నదే యేసు శిష్యుల మరియు పౌలు తపన కూడా! అయితే యేసు తనను క్రీస్తుగా ఒప్పుకుంటే చాలు నిత్యజీవం లభిస్తుందని ప్రకటించినప్పటికి యేసును క్రీస్తుగా అంగీకరించని యూదులతో పౌలు యేసును వారిచే అంగీకరించేయటానికి సరికొత్త పంధాలో యేసును పరిచయం చేసేవాడు. పౌలు నడిపిన ఈ యుక్తి పూర్వక ఉధ్యమమే అందరినీ ఆకట్టుకుంది. దానిలో భాగంగా పౌలు, యేసును గురించి ప్రత్యేకంగా ఈ క్రింది విధంగా అతిశయించి ప్రకటిస్తూ ఉండేవాడు.

క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.  1 కోరింథీ 1:24

ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. –ఫిలిప్పీ 2:6,7

ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. కొలస్సీ 1:15  

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.  ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న 
వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:16,17

ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు. –కొలస్సీ 2:9,10

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,3 ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను. హెబ్రీ 1:3,4

ఆయన (యేసు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. – 1 తిమోతీ 3:16

యేసే దేవుడని విశ్వసించే కొంతమంది పై వాక్యాలను చూపించి యేసే దేవుడని నిరూపించటానికి శతవిధాల ప్రయత్నిస్తుంటారు. అవే వాక్యాల ఆధారంగా పౌలు చేసింది ఏమిటి? “సర్వసృష్టికర్త అయిన యెహోవా అద్వితీయుడు” అని ప్రకటిస్తున్న పరిశుద్ధ లేఖనాలకు, యేసు సువార్తకు వ్యతిరేకంగా యేసు సృష్టికర్త అని విశ్వసింపజేయటమా? లేక అప్పటికే యేసు పట్ల తిరస్కార భావమున్న యూదులచే యేసును క్రీస్తు అని అంగీకరింపజేయటమా? అన్నది గమనిస్తే- నాడు యేసును క్రీస్తు అని అంగీకరించని యూదులకు పౌలు మరికొన్ని అదనపు ప్రత్యేకతలు జోడించి, యేసును క్రొత్త పంధాలో పరిచయంచేసి తన ఉధ్యమాన్ని ముందుకు సాగించేవాడు. దానిలో భాగం గానే పౌలు- “దేవుడు సర్వమూ యేసు ద్వారా చేశాడని” యేసును అతిశయించి చెప్పటం జరిగేది. ఇక ఆచరణ విషయానికి వస్తే యెహోవాను సర్వసృష్టికర్తగా గుర్తించి, యేసును క్రీస్తు అని, నరుడు అని బైబిల్లో యెహోవా, యేసుకు ఇచ్చిన స్థానాన్నే పౌలు కూడా ఇచ్చేవాడు.           

No comments:

Post a Comment