సమస్తమూనూ యేసు ద్వారా చెయ్యబడెను కాబట్టి యేసు సృష్టికర్తా?


ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. – 1 కోరింథీ 8:6

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. కొలస్సీ 1:16  

పై వాక్యాలను బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే “యేసు సృష్టి కర్త” అయి ఉన్నారు అన్నది. నిజానికి పై వాక్యాలలో పౌలు “సర్వమునూ ఆయన ద్వారా సృజింపబడెను” అని చెప్పటాన్ని బట్టి సర్వమునూ యేసుకు వేరుగా దేవుడు సృజించినట్టు తెలుస్తుంది. సరే, పౌలు అలా ఎందుకు ప్రకటించాడు? అన్నది తెలుసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. 

సకల సృష్టి తన ద్వారా చెయ్యబడిందని గానీ, సృష్టి నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉందని గానీ యేసు ఏనాడైనా ప్రకటించుకున్నారా?

సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. మార్కు 10:6

దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. మార్కు 13:19

యేసు స్వయంగా ప్రకటిస్తున్నవే పై వాక్యాలు. వాటిలో గమనర్హమైన విషయం- యేసే స్వయంగా “దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి”, దేవుడు వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేసేను” అనటం. తప్పితే యేసు తనకు తానుగా సృష్టికర్తగా భావించుకుని- “నేను సృజించిన సృష్ట్యాది నుండి”, నేను  వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేశాను” అనటం లేదు. పోనీ త్రిత్వ దైవత్వ వాదులు చెబుతున్నట్టు యెహోవాతో పాటు యేసుకూడా ఒక దేవుడై ఉంది ఆదిలో సృష్టి నిర్మాణం చేశారన్నదే నిజమైతే అప్పుడు కూడా యేసు కచ్చితంగా- “మేము సృజించిన సృష్ట్యాది నుండి” అని, మేము వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేశాము” అని చెప్పి ఉండేవారు. కానీ యేసు తనకు అతీతంగా ఉన్న యెహోవాను ఉద్దేశించి “దేవుడు సృష్ట్యాది నుండి సమస్తమూ సృజించాడ, స్త్రీ, పురుషులను దేవుడే కలుగజేశాడని”ని చెప్పటాన్ని బట్టి యేసు దృష్టిలో సృష్టికర్త ఒక్క యెహోవా మాత్రమే అని తెలుస్తుంది.

బైబిల్ ప్రకారం నిజ దేవుడు ఎవరు? అన్నది నిర్ధారించుకోవటానికి ఒక క్రైస్తవుడు ఎంచుకోవలసిన కొలమానాలేమిటి?

బైబిల్లో దేవుడనేవాడు...

  1. నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడ”ని స్వయంగా ప్రకటించుకుని ఉండాలి!
  2. సకల ప్రవక్తలచే, యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే దేవునిగా ప్రకటించబడి ఉండాలి!
  3. యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే ఘనపరచబడి, కృతజ్ఞతాస్తు తులు చెల్లించబడి ఉండాలి!
  4. యేసుచే, ఆదిమ అపోస్తలులచే, పౌలుచే ప్రార్ధించబడి ఉండాలి!
  5. తనకు పోలిక కలిగిన మరొకడు లేనివాడై ఉండాలి!
  6. చావు, పుట్టుకలకు అతీతుడై ఉండాలి!
  7. బ్రతికించువాడే కాక చంపువాడై కూడా ఉండాలి!
  8. సర్వ శక్తినీ – అధికారాలునూ  కలిగినవాడై ఉండాలి!
  9. సకల మానవ బలహీనతలకు అతీతుడై ఉండాలి!
  10. భూత, భవిష్య, వర్తమాన కాలాలలోనూ దేవుడై ఉండాలి!
  11. ఈ అన్ని ప్రత్యేకతలలో ఏ ఒక్కదానినో లేక వాటిలో కొన్నిటినో కాక, అన్నిటిని ఉమ్మడిగా కలిగినవాడై ఉండాలి!
ఈ సందర్భంలో పై ప్రత్యేకతలన్నీ కలిగిన దేవుడు ఎవరు? అన్నది బైబిల్ వెలుగులో తెలుసుకుందాం.

నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడ”ని ప్రకటించుకున్న దేవుడు ఎవరు?

మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. నిర్గమ 6:2,3

నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. – యెషయ 45:5,6

మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.  నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.  యెషయ 43:10,11

యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. యెషయ 45:21,22

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు.. –ద్వితీ 32:39

అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్పవేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు. –యెవేలు 2:27  

యేసు పూజింపబడ్డారు కాబట్టి దేవుడా?

పై వాక్యంలో తూర్పుదేశ జ్ఞానులు యేసును సాగిలపడి, పూజించారు కనుక ఆయన దేవుడు. యేసు, దేవుడు కాకపోతే వారెందుకు యేసును పూజిస్తారు? అన్నది నేటి అధిక శాతం సువార్తీకుల భావన. అయితే ఇంతకూ తూర్పు దేశ జ్ఞానులు శిశువుగా ఉన్న యేసును సాగిలపడి పూజించింది యేసు, దేవుడు కాబట్టా? లేక గౌరవార్ధం గానా? ఒక వేళ యేసు దేవుడు కాబట్టే పూజించారనుకుంటే ఈ క్రింది అంశాలను తప్పక చదవాల్సి ఉంటుంది.  

దానియేలూ పూజించబడ్డాడు!

అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. దానియేలు 2:46

దావీదు కూడా పూజించబడ్డాడు!

మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. 2 సమూయెలూ 1:2,3

ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి. – 1 దినవృత్తాంతములు 29:20

అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను... 1 సమూయెలూ 25:23  

ఎలీషా కూడా పూజించబడ్డాడు!

యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచిఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి... 2 రాజులు 2:15

యేసు దేవుడే అయితే యేసు స్వతంత్రంగా కలిగి ఉన్న ప్రత్యేకత ఏదైనా ఉందా?

నేటి అభినవ సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసు తండ్రి లేకుండా పుట్టారు, అనేక అద్భుతాలు చేయగలిగారు, పాపులను క్షమించారు, ఇంకా ఆయనకు  సర్వాధికారాలు ఇవ్వబడ్డయి, రక్షకుడని, ప్రభువని  పిలువబడ్డారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఒక్క యేసుకు తప్ప బైబిల్లో ఎవరికీ లేవు కాబట్టి యేసును దేవుడు అనటంలో తప్పేమిటి? అన్నది. ఇలాంటి వాదనలు చేసేవారు అసలు యేసు స్వతంత్రంగా ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి గానూ క్రింది వాక్యాలు జాగ్రత్తగా గమనించగలరు.

యేసు ఈ లోకానికి రావటంలో యేసు అభీష్టం ఏదైనా ఉందా?

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.యోహాను 3:16

నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను...-యోహాను 7:28,29

యేసు స్వతంత్రంగా ఏదైనా చేయగలిగే శక్తి కలిగి ఉన్నారా?

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు.- యోహాను 5:19

నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యోహాను 5:30

నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని. యోహాను 6:38   

యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి యేసు దేవుడా?

తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. –యోహాను 5:22, 23  

పై వాక్యాన్ని బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి యేసు దేవుడు అన్నది. సరే తీర్పు తీర్చుటకు యేసుకు ఏ విధంగా అయితే సర్వాధికారాలు ఇవ్వబడ్డాయో అదే మాదిరగా శిష్యులకు  సహితం తీర్పుతీర్చే అధికారం ఇవ్వబడుతుందని, వారు సైతం ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పుతీర్చనున్నారని స్వయంగా యేసు చెబుతున్నా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.

యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాస నముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. మత్తయి 19:28


యేసు స్వంత అధికారాలు కలిగి ఉన్నారా? దేవునిచే ఇవ్వ బడిన అధికారాలు కలిగి ఉన్నారా?

తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. యోహాను 5:26

అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. – మత్తయి 28:18

“పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అన్న వాక్య భాగాన్ని బట్టి యేసు భూమిమీద మరియు పరలోకంలో సవంత అధికారాలు కలిగి లేరు కానీ, దేవునిచే ఇవ్వబడిన అధికారాలే కలిగి ఉన్నారని తెలుస్తుంది.  

యోహాను 10:33 లో యేసు తనను తాను దేవుడని ప్రకటించుకున్నారా?

అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము-యోహాను 10:33

పై వాక్యాన్ని బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసు యూదుల ముందు “నేను దేవుణ్ణి” అని ప్రకటించుకున్నారు కాబట్టే యూదులు “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అన్నారన్నది.

యేసు నిజంగా తాను దేవుడనని ప్రకటించుకున్నారా? లేక అది యూదుల అభియోగమా?

నేటి సువార్తీకుల అతి చిత్రమైన మరొక వాదన ఏమిటంటే- “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అని యూదులు అన్నప్పుడు యేసు మౌనం వహించారే తప్ప ప్రతిఘటించలేదు! అంటే యేసు తనను తాను దేవుడని ఒప్పుకున్నట్టే కదా! కదా!! అన్నది. ఇంత అమాయకంగా ఆలోచించే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అన్న అభియోగాన్ని మోపినప్పుడు యేసు మౌనం వహించలేదు. కానీ, తీవ్రంగా ప్రతిఘటించారన్నది.

యూదులు మోపిన అభియోగానికి యేసు యొక్క తీవ్రమైన ప్రతిఘటన!

అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయు చున్నావని చెప్పుదురా?యోహాను 34-36  

యేసు తనను తాను దేవుడనని చెప్పుకుని దేవదూషణ చేశారన్న నేరానికి యూదులు ఆయనపై రాళ్ళతో కొట్టటానికి సిద్ధపడిన సందర్భంలో యేసు ఇస్తున్న సమాధానమే పై వాక్యం. ఈ వాక్యంలో యేసు యూదులు మోపిన అభియోగాన్ని ఒప్పేసుకుని తాను దేవుడనని చెప్పుకోవటంలేదు! కానీ, యూదులు తనపై మోపుతున్న దైవ దూషణ నేరాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ వాక్యంలో గమనార్హమైన విషయం- “అందుకు యేసు- మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి యుండలేదా?” అన్నది. అంటే- “మనుష్యుడవైయుండి దేవుడవని చెప్పుకొనుచున్నావని” మీరు నా పై దేవదూషణా నేరం మోపు తున్నారు. కానీ స్వయంగా మీరు కూడా దేవుళ్ళని మీరు చదివే ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది కదా! ఒకవేళ నిజంగా నేను దేవుడనని చెప్పుకుని దేవదూషణా నేరానికి పాల్పడి ఉంటే, స్వయంగా మీ ధర్మశాస్త్రం ప్రకారం నాపై మీరు మోపుతున్న దేవదూషణ నేరంలో మీరూ సమాన భాగస్వాములే అవుతారు!” అన్నది.

నేనును తండ్రీ ఏకమై ఉన్నమంటే?

నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యోహాను 10:30

తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి.. –యోహాను 14:11  

పై వాక్యాలను బట్టి  నేటి అధిక శాతం బోధకుల వాదన ఏమిటంటే- యేసు- “నేనును, తండ్రీ ఏకమై ఉన్నామని చెప్పారు” కాబట్టి యెహోవా ఇద్దరూ ఒక్కటే! కాబట్టి యేసే దేవున్నది! ఈ విధంగా ఊహించుకునేవారు అసలు యేసు ఏ అర్ధంలో “నేనును, తండ్రీ ఏకమై ఉన్నామ”ని చెప్పారో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది.   


యెహోవా మరియు యేసు ఏ విషయంలో ఏకమై ఉన్నారు?

పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము… -యోహాను 17:11

మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యోహాను 17:22  

పై వాక్యాలలో యేసు అభిలషిస్తున్న విషయం ఏమిటంటే- “పరిశుద్ధుడవైన తండ్రీ మనము ఏకమై ఉన్నలాగున వారునూ ఏకమై ఉండవలెనని” అన్నది. అంటే మనము ఏ విధమైన ఏకత్వాన్ని కలిగి ఉన్నామో, ఏ విధంగా ఏకమై ఉన్నామో అదే విధమైన ఏకత్వాన్ని శిష్యులు సైతం కలిగి ఉండాలన్నది.