యేసు పూజింపబడ్డారు కాబట్టి దేవుడా?

పై వాక్యంలో తూర్పుదేశ జ్ఞానులు యేసును సాగిలపడి, పూజించారు కనుక ఆయన దేవుడు. యేసు, దేవుడు కాకపోతే వారెందుకు యేసును పూజిస్తారు? అన్నది నేటి అధిక శాతం సువార్తీకుల భావన. అయితే ఇంతకూ తూర్పు దేశ జ్ఞానులు శిశువుగా ఉన్న యేసును సాగిలపడి పూజించింది యేసు, దేవుడు కాబట్టా? లేక గౌరవార్ధం గానా? ఒక వేళ యేసు దేవుడు కాబట్టే పూజించారనుకుంటే ఈ క్రింది అంశాలను తప్పక చదవాల్సి ఉంటుంది.  

దానియేలూ పూజించబడ్డాడు!

అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. దానియేలు 2:46

దావీదు కూడా పూజించబడ్డాడు!

మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. 2 సమూయెలూ 1:2,3

ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి. – 1 దినవృత్తాంతములు 29:20

అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను... 1 సమూయెలూ 25:23  

ఎలీషా కూడా పూజించబడ్డాడు!

యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచిఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి... 2 రాజులు 2:15


అబ్షాలోము కూడా స్తుతించబడి, పూజించబడ్డాడు!

తరువాత వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కా రము చేసి రాజును స్తుతించిరాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.  2 సమూయెలు 14:22,23

యూదా కూడా స్తుతించబడి, పూజించబడ్డాడు!

యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు. - ఆదికాండం 49:8

పేతురు కూడా పూజించబడ్డాడు!

పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాద ములమీద పడి నమస్కారము చేసెను. .పో.కా 10:25

పౌలు కూడా పూజించబడ్డాడు!

అతడు దీపముతెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి .పో.కా 16:29

వాస్తవానికి సాగిల పడటం, పూజించటం, స్తుతించటం, మ్రోక్కటం, ఘనపరచటం, మహిమపరచటం అన్నవి బైబిల్లో అటు యెహోవా విషయంలో విశ్వాసులందరూ చేసినట్లు చూడగలం ఇవే పనులు అనేక మంది ప్రవక్తల విషయంలో సైతం చేసినట్లు చూడగలం. అయితే అనేకమంది ప్రవక్తలు స్తుతించబడింది, ఘనపరచపడింది, పూజించబడింది కేవలం గౌరవార్ధంగా మాత్రమే! అది అప్పటి ఆచారం. అదే విధంగా యేసును సైతం గౌరవార్ధంగా మాత్రమే పూజించటం జరిగింది. లేదు యేసు దేవుడు కాబట్టి పూజించటం జరిగిందని ఎవరైనా వాదిస్తే అప్పుడు దానియేలును, దావీదును, ఎలీషా వగైరా పూజింపడిన అనేకమంది ప్రవక్తలను కూడా దేవుళ్ళని ఒప్పుకోవాల్సి ఉంటుంది!

నేడు బోధకులు బైబిల్ “చదివి” యేసు దేవుడని భావిస్తున్న మాదిరి గానే నాడు యేసు బోధను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులూ అలాగే భావించేవారా?

యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – “సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయని ప్రకటించారు – “అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు!” – “తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు!” – “నేనే మార్గం, సత్యం, జీవమని ప్రకటించారు”– ఇంకా “యేసు, దేవుని ప్రియకుమారుడని ప్రకటించబడ్డారు!” – “అనేక అద్భుతాలు చేశారు!” – “యెహోవాకు ఉన్న పేర్లు యేసు కూడా కలిగి ఉన్నారు!” – “పునరుత్థా నమయ్యారు!” వగైరా ప్రత్యేకతలు యేసుకు ఉన్నప్పుడు యేసును దేవుడని భావించటంలో తప్పేమిటి? ఇన్ని ప్రత్యేకతలు యేసు దేవుడు కాకపోతే ఆయనకు ఉంటాయా? అన్నది నేటి అధిక శాతం సువార్తీకుల వాదన!

ఈ వాదన వినటానికైతే ఎంతో బాగుంది. అయితే నేడు పై ప్రత్యేకతలను బట్టి యేసును దేవుడని భావించటంలో తప్పులేదని ఊహించుకునేవారు... తాము చదువుతున్న ప్రత్యేకతలు ఆదిమ అపోస్తలు లకు సైతం తెలిసే ఉంటాయి కదా అన్నది ఎందుకు ఆలోచించరు? ఆ ప్రత్యేకతలను బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసే దేవుడనే ప్రచారం చెయ్యక యేసు “మెస్సియ” అనే ప్రచారం మాత్రమే ఎందుకు చేసేవారు? అన్న కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?

ఆదిమ అపోస్తలులకు, నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులకూ ఉన్న మౌలిక తేడా ఏమిటంటే-  నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులు బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న యేసు, దేవుడు కాకపోవటం ఏమిటి? అని ఊహించుకుంటున్నారు. కానీ, ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా తర్ఫీదు పొంది, ఆయన వద్ద శిక్షణ పొంది, ఆయన చెప్పిన సమస్త సువార్తను “చదవటం” కాదు స్వయంగా “విని” ఉన్నారు. దానిని విని నేటి సువార్తీకుల మాదిరిగా యేసు దేవుడనే అనుమానానికి ఎప్పుడూ గురికాలేదు! అంతేకాదు తాము స్వయంగా విన్న మరియు చూచిన దానినే మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులే ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు.

ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని టాకీ చూచేనో, అది మీకు తెలియజేయుచున్నాము. – 1 యోహాను 1:1

దీనిని బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా విన్నదే బోధించారు తప్ప నేటి సువార్తీకుల మాదిరిగా చదివి లేక ఎవరి ద్వారానో విని బోధించలేదని తేటతెల్లమవుతుంది. కాబట్టి నేడు బైబిల్ల్ కొన్ని వాక్యాలు కేవలం చదివి యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – యేసు అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – యేసు తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! వగైరా వగైరా ప్రత్యేకత లను బట్టి యేసు దేవుడని ప్రకటించటంలో తప్పులేదనుకుంటే అలా ప్రకటించటానికి మొట్టమొదటి హక్కు దారులు యేసు శిష్యులే అవుతారు. కానీ ఈ ప్రత్యేకతలన్నిటినీ స్వయంగా “విని” “చూచి” ఉన్న ఆదిమ అపోస్తలులు ఏనాడూ యేసును దేవుడై ఉంటారని ఊహించుకోవటంగానీ, అలా యూదులను ఒప్పించటంగానీ చేయలేదు. కానీ, ఇంటింటికీ తిరిగి యేసే “క్రీస్తు” అయి ఉన్నాడని ఒప్పించేవారు (ఆ.పో.కా 5:42). చివరకు యేసు తన దర్శనంలో కనిపించారని ప్రకటించుకున్న పౌలు సైతం ఏనాడూ యేసే దేవుడని ప్రకటించక యూదులకు అనేక లేఖనాలను ఆధారంగా చూపి యేసు “మెస్సియ” (క్రీస్తు) అయి ఉన్నారని ఒప్పిస్తూ ఉండేవాడు. (ఆ.పో.కా 17:3+18:5).

కాబట్టి యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానమూ ఒక ప్రక్క ఉంది. అదే యేసు సువార్తను “చదివి” నేడు సువార్తీకులు చేస్తున్న వ్యాఖ్యానమూ మరో ప్రక్క ఉంది. ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఏ వ్యాఖ్యానం ప్రామాణికం అవుతుంది? అన్నది గమనిస్తే కచ్చితంగా నాడు యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానమే ప్రామాణికం అవుతుంది. ఆ తరువాత ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానానికి సరిపోయే వ్యాఖ్యానం ఎవరైనా చేస్తే దానిని కూడా కచ్చితంగా తీసుకోవచ్చు.

నిజంగా ఒకవేళ యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! - అనేక అద్భుతాలు చేశారు! వగైరా ప్రత్యేకతలను బట్టి యేసు దేవుడని వ్యాఖ్యానించటం సరైనదే అయితే ఆ పని ఏనాడో ఆదిమ అపోస్తలులు చేసి ఉండేవారు. కాబట్టి ఏ యే వాక్యాలైతే “చదివి” యేసు దేవుడని నేడు కొందరు ప్రచారం చేస్తున్నారో ఆ వాక్యాలను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులు, యేసు దేవుడని ఎక్కడా ప్రచారం చెయ్యలేదంటే నేటి బోధకులు చేస్తున్న ప్రచారం కేవలం వాక్యవిరుద్ధం అని తెలుస్తుంది. ఇక నాడు యేసుకు, యూదులకు, ఆదిమ అపోస్తలులకూ, యూదులకు, పౌలుకు, యూదులకూ మధ్య యేసు మెస్సియా? కాదా? అన్న చర్చే జరిగినట్లు బైబిల్లో చూడగలం తప్ప ఎక్కడా యేసు దేవుడా? కాదా? అన్న వాదనే జరిగినట్లు చూడలేము. కానీ అలాంటి ప్రచారాలు చేస్తుంది మటుకు నేటి నామమాత్ర బోధకులు మాత్రమే! కాబట్టి ఏ వాక్యాలనైతే చదివి నేటి అధికశాతం సువార్తీకులు యేసే దేవుడనే భావనకు గురై ఉన్నారో ఆ వాక్యాల అసలు వాస్తవికతను పరిశుద్ధ బైబిల్ గ్రంధం వెలుగులో ఈ వెబ్ సైట్ లో ఎంతో వివరంగా వివరించటం జరిగింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ద బైబిల్ వాక్యాల యదార్ధ వాస్తవీకతను అర్థం చేసుకుని, అసలు సత్యాన్ని స్వీకరించే జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించు గాక. ఆమేన్.                    

No comments:

Post a Comment