యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి యేసు దేవుడా?

తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు. –యోహాను 5:22, 23  

పై వాక్యాన్ని బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి యేసు దేవుడు అన్నది. సరే తీర్పు తీర్చుటకు యేసుకు ఏ విధంగా అయితే సర్వాధికారాలు ఇవ్వబడ్డాయో అదే మాదిరగా శిష్యులకు  సహితం తీర్పుతీర్చే అధికారం ఇవ్వబడుతుందని, వారు సైతం ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పుతీర్చనున్నారని స్వయంగా యేసు చెబుతున్నా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.

యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాస నముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. మత్తయి 19:28


యేసు స్వంత అధికారాలు కలిగి ఉన్నారా? దేవునిచే ఇవ్వ బడిన అధికారాలు కలిగి ఉన్నారా?

తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. యోహాను 5:26

అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. – మత్తయి 28:18

“పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అన్న వాక్య భాగాన్ని బట్టి యేసు భూమిమీద మరియు పరలోకంలో సవంత అధికారాలు కలిగి లేరు కానీ, దేవునిచే ఇవ్వబడిన అధికారాలే కలిగి ఉన్నారని తెలుస్తుంది.  


సమస్త అధికారాలూ దేవునిచే నియమించబడతాయి!

ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. రోమా 13:1

పై పరిశుద్ధ వాక్యాన్ని బట్టి కేవలం దేవునిచే ఇవ్వబడిన అధికారాలే తప్ప ఎవరికీ ఏ స్వంత అధికారాలు ఉండవని, ఎవరికైనా ఏదైనా అధికారం ఉంటే అది కేవలం దేవునిచే నియమించబడిన అధికారమే తప్ప అది వారి స్వంత అధికారం కాదని తెలుసుకున్నాం. వాస్తవం ఇదైనప్పుడు ఏ స్వంత అధికారాలు లేని యేసు దేవుడు అవుతారా? ఆయనకైనా మరెవరికైనా సర్వాధికారాలు ఇచ్చే యెహోవా దేవుడు అవుతాడా? విజ్ఞులు ఆలోచించగలరు.

సమస్త అధికారాలు యేసుకు ఇవ్వబడిన కారణంగా పౌలు సైతం యేసు దేవుడనే భావించాడా?

యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయాన్న వాక్యాన్ని నేటి సువార్తీకులే కాదు నాడు పౌలు కూడా చదివి ఉంటాడు కదా! మరి పౌలు కూడా నేటి సువార్తీకుల మాదిరిగానే యేసు దేవుడనే భావనకు గురై యేసే దేవుడని ప్రకటించేవాడా? అన్నది తెలుసుకోవాలంటే పౌలు చెబుతున్న ఈ క్రింది వాక్యం చదవాల్సిందే!

దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. -1 కొరింథీ 27,28

పై వాక్యంలో పౌలు, యేసుకు సమస్తమూనూ లోపరచినప్పుడు యేసు దేవుడైపోయారని చెప్పక, “ఆయనకు సమస్తమూనూ లోపరచినప్పుడు కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును” అని చెబుతున్నాడు. కాబట్టి ఒకని ద్వారా అధికారాలు పొందినవాడు దేవుడవుతాడా? లేక అధికారాలు ఇచ్చేవాడు దేవుడు అవుతాడా? ఆలోచించగలరు.

దేవుడు సమస్త అధికారాలు యేసుకు శాశ్వతంగా ఇచ్చేశాడా?

అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. -1 కోరింధీ 15:24

పై వాక్యాన్ని బట్టి దేవుడు, యేసుకు ఇచ్చిన సర్వాధికారాలు శాశ్వత ప్రాతిపదిక మీదకాదు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఇచ్చాడని తేటతెల్లమవుతుంది. దీనిని బట్టి ఏ యే అధికారాలైతే దేవుడు, యేసుకు ఇచ్చాడో అవన్నీ యేసు తిరిగి దేవునికే అప్పజెప్పుతారని తేటతెల్లమైంది. ఈ విధంగా ఒకరినుండి అదికారాలు పొందేవాడు, తిరిగి ఆ అధికారాలు అప్పగించేసేవాడు దేవుడు ఎలాకాగలడు? ఆలోచించగలరు.

“సమస్త అధికారము” అనగా దాని పరిధి ఎంత?

నేటి అధికశాతం సువార్తీకుల భావన ఏమిటంటే దేవుడు సమస్త దైవత్వపు అధికారాలను యేసు ఇచ్చేశాడు! కాబట్టి యేసు సర్వాధికారి అయిన దేవుడన్నది. ఇలాంటి భావనకు గురైన వారు ముందు తెలుసుకోవలసింది దేవుడు మానవునికి సైతం సర్వాధికారాలు ఇచ్చాడన్నది!

“సమస్త అధికారము” దేవుడు మానవునికి సైతం ఇచ్చాడు!

నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. హెబ్రీ 2:6-8

పై వాక్యాన్ని బట్టి సమస్త అధికారాలూ మానవునికి కూడా  ఇవ్వటం జరిగిందని తెలుస్తుంది. అంటే కాదు యెహోవాకు ఉన్నట్లు పాపాలు క్షమించే అధికారం యేసుకు ఉంది! కాబట్టి యేసు దేవుడని కొందరు వాదిస్తూ ఉంటారు. అచ్చం అదేవిధంగా పాపాలను క్షమించే అధికారం మానవునికి కూడా ఉంది- “మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన యెడల, మీ పరలోకపు తండ్రియూ మీ అపరాధములు క్షమించును” –మత్తయి 6:14. ఈ విధంగా మానవునికి సర్వాధికారాలతో పాటు, పాపాలు క్షమించే అధికారం కూడా ఉంది కాబట్టి మనుష్యులు కూడా దైవాలైపోతారా? ఇంకా యెహోవా వలె యేసు తీర్పు తీర్చు తారు కాబట్టి యేసు దేవుడే అన్నది కొందరి వాదన! అయితే ఆదిమ అపోస్తలులు సైతం తీర్పు తీరుస్తారు “నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆశీనులై ఇస్రాయేలూ పండ్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు” – మత్తయి 19:28 కాబట్టి వారందరూ దైవాలైపోతారా? కాదు కదా!

ఇక సర్వాధికారాలు దేవుడు అటు మానవునికైనా ఇటు యేసుకైనా ఇచ్చినంత మాత్రాన దేవుడు తన అధికారాన్నంతా కోల్పోయి ఖాళీ అయిపోతాడని కాదు కదా! ఈ విషయం మీకు అర్ధం కావాలంటే- ఉదాహరణకు ఒక “జాతీయ అధికారి” తన క్రింది “రాష్ట్ర  స్థాయి” “జాతీయ స్థాయి” అధికారులకు సర్వాధికారాలు అప్పగిస్తాడు. అంటే దాని అర్ధం ఎవని ద్వారా సర్వాధికారాలు పొందారో వారు తమకు అధికారాన్ని ఇచ్చిన వానితో సమానం  అయిపోతారా? కాదు కదా! వాస్తవానికి ఒక జాతీయ స్థాయి అధికారి తన క్రింది స్థాయి వ్యక్తులకు సర్వాధికారాలు అప్పగించినా అది వారి వారి పరిధుల మేరకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది. అదే విధంగా యేసుకు దేవుడు పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు. అంతమాత్రాన యేసు సమస్త పాపాలు క్షమించే అధికారం కలిగి లేరు. దానికి గొప్ప ఉదాహరణ: “యేసు- తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించమ”ని (లూకా 23:34) అని ప్రార్ధించటం. నిజంగా యేసు సర్వాధికారే అయితే వారిని యేసే క్షమించి పారేయచ్చుగా! దీని బట్టి చిన్న చిన్న పాపాలు క్షమించే అధికారం మనము కలిగి ఉన్నాం, యేసు కూడా కలిగి ఉన్నారు! కానీ పెద్ద పెద్ద పాపాలు క్షమించే అధికారం ఒక్క దేవుడే కలిగి ఉన్నాడు!

అలాగే యేసు పరలోకంలో సమస్త అధికారాలు కలిగి లేరు!

అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.  అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. మత్తయి 20:20-23  

యేసుకు సమస్త అధికారాలు ఇవ్వబడినప్పకి అవి ఒక పరిధి మేరకు మాత్రమే!

దేవుడు సర్వాధికారాలు యేసుకు ఇచ్చినంత మాత్రాన యేసు, యెహోవాతో పాటు సర్వాధికారి అయిన దేవుడైపోలేదు! కానీ, ఒక పరిధి మేరకు మాత్రమే యేసు అధికారాలు కలిగి ఉన్నారు. ఆ పరిధి ఎంత అన్నది అర్థం కావాలతే ఈ క్రింది వాక్యాలు చదవగలరు.

నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను… -యోహాను 5:30

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు… -యోహాను 5:19

ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.- యోహాను 12:49

యేసు చెబుతున్న పై వాక్యాలను బట్టి యేసుకు ఇవ్వబడిన సర్వాధికారాల పరిధి ఎంత? అంటే దేవుడు, యేసుకు మాట్లాడటానికి, సువార్త చేయటానికి, యేదైనా మహిమ చేయటానికి ఎంత అధికారం ఇచ్చాడో ఆ పరిధికి మించి యేసుకు అధికారం లేదు. ఈ విషయాని ఈ క్రింది వాక్యం ద్వారా మరింత బాగా అవగతం అవుతుంది.

తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో అదేకాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. –యోహాను 5:19

అంటే చేయటానికి తండ్రి ఏదైతే చూపుతాడో అదే తప్ప స్వతహాగా యేసు ఏదీ చేయలేరు! అంటే యేసు చేసే ప్రతీదీ తండ్రి చూపిందే తప్ప స్వంతంగా చేసింది ఏదీ లేదన్నమాట! ఆదిమ అపోస్తలులు సైతం ఇదేవిషయాన్ని చెబుతున్నారు.

ఇస్రాయేలు వారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మాహాత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యన చేయించి, ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. -అ.పో.కా. 2:22

పై వాక్యాన్ని బట్టి యేసు చేసిన సమస్త మహిమాలూ, అద్భుతాలూ యేసు స్వంత శక్తి ద్వారా జరగ లేదు. కానీ దేవుడు గత ప్రవక్తల ద్వారా చేయించిన మాదిరిగానే యేసు ద్వారా అద్భుతాలు, మహిమలు చేయించటం జరిగింది. దీనిని బట్టి యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడినంత మాత్రాన అవి ఒక పరిధి మేరకు మాత్రమే అని, యేసు చేసిన సమస్త మహిమాలూ, అధ్బుతాలు, మాహాత్కార్యాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారం, శక్తి ద్వారా తప్ప యేసు దేవుడు అవటం కారణంగానో, ఆయనలో స్వంత దైవ శక్తి ఉండటం కారణంగానో జరగలేదని తెలుసుకున్నాం.

నేడు బోధకులు బైబిల్ “చదివి” యేసు దేవుడని భావిస్తున్న మాదిరి గానే నాడు యేసు బోధను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులూ అలాగే భావించేవారా?

యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – “సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయని ప్రకటించారు – “అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు!” – “తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు!” – “నేనే మార్గం, సత్యం, జీవమని ప్రకటించారు”– ఇంకా “యేసు, దేవుని ప్రియకుమారుడని ప్రకటించబడ్డారు!” – “అనేక అద్భుతాలు చేశారు!” – “యెహోవాకు ఉన్న పేర్లు యేసు కూడా కలిగి ఉన్నారు!” – “పునరుత్థా నమయ్యారు!” వగైరా ప్రత్యేకతలు యేసుకు ఉన్నప్పుడు యేసును దేవుడని భావించటంలో తప్పేమిటి? ఇన్ని ప్రత్యేకతలు యేసు దేవుడు కాకపోతే ఆయనకు ఉంటాయా? అన్నది నేటి అధిక శాతం సువార్తీకుల వాదన!

ఈ వాదన వినటానికైతే ఎంతో బాగుంది. అయితే నేడు పై ప్రత్యేకతలను బట్టి యేసును దేవుడని భావించటంలో తప్పులేదని ఊహించుకునేవారు... తాము చదువుతున్న ప్రత్యేకతలు ఆదిమ అపోస్తలు లకు సైతం తెలిసే ఉంటాయి కదా అన్నది ఎందుకు ఆలోచించరు? ఆ ప్రత్యేకతలను బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసే దేవుడనే ప్రచారం చెయ్యక యేసు “మెస్సియ” అనే ప్రచారం మాత్రమే ఎందుకు చేసేవారు? అన్న కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?

ఆదిమ అపోస్తలులకు, నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులకూ ఉన్న మౌలిక తేడా ఏమిటంటే-  నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులు బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న యేసు, దేవుడు కాకపోవటం ఏమిటి? అని ఊహించుకుంటున్నారు. కానీ, ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా తర్ఫీదు పొంది, ఆయన వద్ద శిక్షణ పొంది, ఆయన చెప్పిన సమస్త సువార్తను “చదవటం” కాదు స్వయంగా “విని” ఉన్నారు. దానిని విని నేటి సువార్తీకుల మాదిరిగా యేసు దేవుడనే అనుమానానికి ఎప్పుడూ గురికాలేదు! అంతేకాదు తాము స్వయంగా విన్న మరియు చూచిన దానినే మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులే ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు.

ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని టాకీ చూచేనో, అది మీకు తెలియజేయుచున్నాము. – 1 యోహాను 1:1

దీనిని బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా విన్నదే బోధించారు తప్ప నేటి సువార్తీకుల మాదిరిగా చదివి లేక ఎవరి ద్వారానో విని బోధించలేదని తేటతెల్లమవుతుంది. కాబట్టి నేడు బైబిల్ల్ కొన్ని వాక్యాలు కేవలం చదివి యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – యేసు అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – యేసు తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! వగైరా వగైరా ప్రత్యేకత లను బట్టి యేసు దేవుడని ప్రకటించటంలో తప్పులేదనుకుంటే అలా ప్రకటించటానికి మొట్టమొదటి హక్కు దారులు యేసు శిష్యులే అవుతారు. కానీ ఈ ప్రత్యేకతలన్నిటినీ స్వయంగా “విని” “చూచి” ఉన్న ఆదిమ అపోస్తలులు ఏనాడూ యేసును దేవుడై ఉంటారని ఊహించుకోవటంగానీ, అలా యూదులను ఒప్పించటంగానీ చేయలేదు. కానీ, ఇంటింటికీ తిరిగి యేసే “క్రీస్తు” అయి ఉన్నాడని ఒప్పించేవారు (ఆ.పో.కా 5:42). చివరకు యేసు తన దర్శనంలో కనిపించారని ప్రకటించుకున్న పౌలు సైతం ఏనాడూ యేసే దేవుడని ప్రకటించక యూదులకు అనేక లేఖనాలను ఆధారంగా చూపి యేసు “మెస్సియ” (క్రీస్తు) అయి ఉన్నారని ఒప్పిస్తూ ఉండేవాడు (ఆ.పో.కా 17:3+18:5) తప్పితే నేను దర్శనంలో దేవుణ్ణి చూచానని గాని, యేసే దేవుడని గానీ ఏనాడూ ప్రకటించలేదు.
కాబట్టి యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానమూ ఒక ప్రక్క ఉంది. అదే యేసు సువార్తను “చదివి” నేడు సువార్తీకులు చేస్తున్న వ్యాఖ్యానమూ మరో ప్రక్క ఉంది. ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఏ వ్యాఖ్యానం ప్రామాణికం అవుతుంది? అన్నది గమనిస్తే కచ్చితంగా నాడు యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానమే ప్రామాణికం అవుతుంది. ఆ తరువాత ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానానికి సరిపోయే వ్యాఖ్యానం ఎవరైనా చేస్తే దానిని కూడా కచ్చితంగా తీసుకోవచ్చు.
నిజంగా ఒకవేళ యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! - అనేక అద్భుతాలు చేశారు! వగైరా ప్రత్యేకతలను బట్టి యేసు దేవుడని వ్యాఖ్యానించటం సరైనదే అయితే ఆ పని ఏనాడో ఆదిమ అపోస్తలులు చేసి ఉండేవారు. కాబట్టి ఏ యే వాక్యాలైతే “చదివి” యేసు దేవుడని నేడు కొందరు ప్రచారం చేస్తున్నారో ఆ వాక్యాలను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులు, యేసు దేవుడని ఎక్కడా ప్రచారం చెయ్యలేదంటే నేటి బోధకులు చేస్తున్న ప్రచారం కేవలం వాక్యవిరుద్ధం అని తెలుస్తుంది. ఇక నాడు యేసుకు, యూదులకు, ఆదిమ అపోస్తలులకూ, యూదులకు, పౌలుకు, యూదులకూ మధ్య యేసు మెస్సియా? కాదా? అన్న చర్చే జరిగినట్లు బైబిల్లో చూడగలం తప్ప ఎక్కడా యేసు దేవుడా? కాదా? అన్న వాదనే జరిగినట్లు చూడలేము. కానీ అలాంటి ప్రచారాలు చేస్తుంది మటుకు నేటి నామమాత్ర బోధకులు మాత్రమే! కాబట్టి ఏ వాక్యాలనైతే చదివి నేటి అధికశాతం సువార్తీకులు యేసే దేవుడనే భావనకు గురై ఉన్నారో ఆ వాక్యాల అసలు వాస్తవికతను పరిశుద్ధ బైబిల్ గ్రంధం వెలుగులో ఈ వెబ్ సైట్ లో ఎంతో వివరంగా వివరించటం జరిగింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ద బైబిల్ వాక్యాల యదార్ధ వాస్తవీకతను అర్థం చేసుకుని, అసలు సత్యాన్ని స్వీకరించే జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించు గాక. ఆమేన్.                    

No comments:

Post a Comment