“నన్ను చూచు వాడు తండ్రిని చూచి యున్నాడు” అంటే...?


అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా?యోహాను 14:8-10

పై వాక్యాన్ని బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే- యెహోవా యే యేసుగా అవతరించాడు! కాబట్టే యేసు నన్ను చూస్తే ఆ తండ్రిని చూసినట్టే అని చెప్పారు. కాబట్టి యెహోవాయే యేసు అన్నది నేటి అధిక శాతం సువార్తీకుల ప్రచారం.

ఫిలిప్పు తండ్రిని చూపించమని యేసును కొరటానికి ముందే యేసు ఫిలిప్పు మరియు శిష్యుల ముందు ఒక విషయాన్ని స్పష్టపరిచారు. అదేమిటో ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.


మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. యోహాను 5:37

పై వాక్యంలో యేసు ఎంతో స్పష్టంగా ఒక విషయాన్ని స్పష్టపరుస్తున్నారు. అదేమిటంటే ఎవరును ఏ కాలమందైనను తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని ఎవరు చూడలేదన్నది. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫిలిప్పు దేవునిని చూపించమని యేసును కోరటాన్ని బట్టి ఫిలిప్పు, యేసును ప్రత్యక్ష్యంగా దేవునిగా ఏనాడు భావించలేదని తెలుస్తుంది.


అయినప్పటికి నన్ను చూచు వాడు తండ్రిని చూచి యున్నాడు” అని ప్రకటించటంలో యేసు లక్ష్యం ఏమిటి?

“నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పటంలో యేసు ఉద్దేశం- దేవుడు నాకు మాదిరిగా భౌతిక స్వరూపాన్ని అంటే నాకు మాదిరిగా గెడ్డం, మీసాలు, పొడవాటి జుట్టు, రెండు కాళ్ళు, చెవులు, చేతులు, ముక్కు కలిగి ఉన్నాడని చెప్పటం కాదు! అయినప్పటికి “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని యేసు ఎందుకు చెప్పారు? అన్నది తెలుసుకోవాలంటే ముందు యోహాను 14:8-10 వాక్యాలలో చివరి భాగాన్ని ఒకసారి గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే...

“...తండ్రిని మాకు కనపరుచమని యేల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా?”

పై వాక్యభాగాన్ని బట్టి “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని యేసు ఎందుకు చెప్పారో అర్ధమవుతుంది. అలా చెప్పటానికి కారణం ఏమిటంటే- “తండ్రి యందు యేసు, యేసు యందు తండ్రి ఉండటమే!”

ఒక్క యేసు యందు మాత్రమే తండ్రి ఉన్నాడా? ఒక్క యేసు మాత్రమే తండ్రి యందు ఉన్నారా?

దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండు వాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. – 1 యోహాను 4:16

పై వాక్యాన్ని బట్టి దేవుడు కలిగి ఉండే ప్రేమ అనే గుణాన్ని ఏ విశ్వాసి అయితే కలిగి ఉంటాడో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతను దేవుని యందు నిలిచి ఉంటాడని తేటతెల్లమవుతుంది. అంటే ఆ విశ్వాసి దేవుని యందు మరియు దేవుడు అతనియందు నిలిచి ఉండటాన్ని బట్టి ఆ విశ్వాసిని ఒకవేళ తండ్రిని చూపించమంటే అతను సైతం “నన్నుచూచు వాడు తండ్రిని చూచియున్నాడనే” అంటాడు!

పై పరిశీలనను బట్టి దేవునిలో ఉండే ప్రేమా, దయ, జాలి, కరుణ వంటి సుగుణాలు ఏ విశ్వాసి అయితే  కలిగి ఉంటారో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతను దేవుని యందు నిలిచి ఉంటాడు. ఈ విధంగా ఏ విశ్వాసిలో అయితే దేవుడు నిలిచి ఉంటాడో అతనిని చూచినా దేవునిని చూచినట్లే అవుతుందని తేటతెల్లమైంది.

అలాగే యేసు సైతం దేవునిలో ఉండే ప్రేమా, దయ, జాలి, కరుణ వంటి సుగుణాలు పరిపూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తి. కాబట్టి ఫిలిప్పు అమాయకంగా “నన్ను తండ్రిని చూప”మని కోరినప్పుడు యేసు, “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు. అంటే నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటే ఆ తండ్రిని తెలుసుకున్నాట్టే అని అర్థం. యేసు, “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పి  తండ్రిని తనతో పోల్చుకున్న పోలిక కేవలం “గుణ పరమైన పోలిక మాత్రమే!” తప్పితే “శారీరక పోలిక” కాదు!! పైగా యేసు ఎంతో స్పష్టంగా “తండ్రి నాకంటే గొప్పవాడు” (యోహాను 14:28) అని ప్రకటించి ఉన్నారు.

యేసు అదృశ్య దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు! కాబట్టి యేసు నన్ను చూచు వాడు తండ్రిని చూచి యున్నాడు అని చెప్పారా?

నేటి సువార్తీకుల ఒక విచిత్రమైన ప్రచారం ఏమిటంటే- “యేసు అదృశ్య దేవుని స్వరూపియై యున్నారు” (కొలస్సీ 1:15) కాబట్టే యేసు-  “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారన్నది! ఇలాంటి ప్రచారాలు  చేసేవారు ఈ క్రింది వాక్యాలను కాస్త గమనించాల్సి ఉంటుంది.

పై వాక్యాలను బట్టి ఆదాము దేవుని స్వరూపి మరియు ప్రతీ పురుషుడు దేవుని స్వరూపి అయి ఉన్నాడని తేటతెల్లమవుతుంది. ఇప్పుడు నేటి బోధకుల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రతీ పురుషుడు దేవుని స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి పురుషుని చూచినా దేవునిని చూచినట్టే అనటంలో తప్పులేదనేకదా?

వాస్తవానికి యేసు అదృశ్య దేవుని స్వరూపి అంటే ముందు అంశాలలో మనం చర్చించుకున్నట్టు యేసు, దేవునిలో ఉండే ప్రేమైక స్వభావ్వాన్ని కలిగి ఉన్నారు అని చెప్పటానికి అలంకారిక పోలిక మాత్రమే! తప్పితే యేసు, దేవుని ఆకారాన్నో లేక దేవుని శారీరక పోలికనో  కలిగి ఉన్నారని కాదు!

నన్ను చూచు వాడు తండ్రిని చూచి యున్నాడు అని చెప్పటాన్ని బట్టి శిష్యులు ఏనాడైనా యేసును ప్రత్యక్షంగా దేవుడని భావించారా?

“నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అన్న వాక్యాన్ని “చదివి” నేటి సువార్తీకులు యేసే యెహోవా అని ఊహించుకుంటున్నారు! సరే ఈ వాక్యాన్ని శిష్యులు “చదవటం” కాదు కానీ ప్రత్యక్షంగా చెవులారా “విని” యున్నారు! మరి యేసు నోటి ద్వారా ప్రత్యక్షంగా “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అన్న వాక్యాన్ని విన్న శిష్యులు మరి నేటి సువార్తీకుల మాదిరిగానే యేసును ప్రత్యక్షంగా దేవుడని భావించారా? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రింది వాక్యాన్ని గమనించాల్సి ఉంటుంది.

 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు.- 1 యోహాను 4:12

పై వాక్యాన్ని చెప్పటానికి ముందే శిష్యులు యేసును చూచి ఉన్నారు! నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అన్న మాటను ప్రత్యక్షంగా విని ఉన్నారు. అంతేకాదు పౌలు ఈ క్రింది వాక్యం చెప్పేనాటికే యేసును దర్శనంలో చూచియున్నాడు!

సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యు లలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు… -1 తిమోతీ 6:16

అయినప్పటికి యేసును ప్రత్యక్షంగా చూచిన శిష్యులుగానీ, యేసును దర్శనంలో చూచానని చెప్పుకున్న పౌలుగానీ యేసును “శరీరధారిగా అవతరించిన యెహోవా” గా ఏనాడూ భావించలేదని చెప్పటానికి గొప్ప ఆధారం వారు యేసును చూచినప్పటికీ దేవునిని ఏ మానవుడూ ఎప్పుడూ చూడలేదు! చూడలేడు! అని ప్రకటించటమే!

“చూచుట” అనగా “సంపూర్ణంగా గ్రహించుట” అని అర్థం.

మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. మత్తయి 13:12
గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు. మత్తయి 13:15

అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మత్తయి 13:16   

పై వాక్యాలను బట్టి “చూచుట” అంటే అక్షరార్థంలో కళ్ళతో చూడటం అని కాదు కానీ భావార్ధంలో “సంపూర్ణంగా గ్రహించటం” అని అర్ధం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది వాక్యాలు గమనించగలరు.

అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.  నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచు న్నాడు. యోహాను 12:44-45

మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.- యోహాను 14:7

పై వాక్యాలలో రెండవ వాక్యంలో యేసు- “మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు అంటున్నారు. అంటే నన్ను పూర్తిగా తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నాట్టే! అని అర్థం. ఇలా చెప్పి “ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు నన్ను పూర్తిగా తెలుసుకున్నారు. అని చెప్పి ఆయనను చూచియున్నారు అంటున్నారు. ఈ వాక్యభాగంలో “చూచి యున్నారు” అంటే తండ్రిని సంపూర్ణంగా తెలుసుకున్నారు అని అర్థం. వివరంగా చెప్పాలంటే “ఎప్పుడైతే మీరు నన్ను పూర్తిగా తెలుసుకున్నారో అప్పుడే మీరు తండ్రిని చూచియున్నారు” అని అర్ధం. ఈ అర్థంలోనే యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచి యున్నాడు” అని చెప్పారు.

యేసు బోధలో అలంకారిక పోలికలు!

మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. లూకా 10:16 

మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. మత్తయి 10:40

అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. యోహాను 12:44

 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. యోహాను 12:45 

పై వాక్యాలను బట్టి శిష్యుల మాటవింటే యేసు మాట విన్నట్టు! శిష్యులను తిరస్కరిస్తే యేసును తిరస్కరించినట్టు!  శిష్యులను చేర్చుకుంటే యేసును చేర్చుకున్నట్టు! అదే విధంగా యేసు మాట వింటే దేవుని మాట విన్నట్టు. యేసు మాట తిరస్కరిస్తే దేవుని మాట తిరస్కరించినట్టు! కారణం యేసు చెప్పింది దేవుని ద్వారా విన్న మాటలు కాబట్టి. అలాగే యేసును విశ్వసిస్తే యేసును కాదు యేసును పంపిన దేవునినే విశ్వసించినట్టు! అలాగే యేసును చూస్తే అంటే ఆయనను సంపూర్ణంగా గ్రహిస్తే దేవునిని చూచినట్లు. అందుకే యేసు ఏమంటున్నారంటే...

కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవమ్ పొందుటయే నా తండ్రి చిత్తము – యోహాను 6:40              

No comments:

Post a Comment